కాఫీవిత్…ఆర్. రమాదేవి/ గీతా వెల్లంకి.2742.
రెండు కవితలు.. ఇద్దరు కవయిత్రులు.. ఒకే సాదృశ్యం…
*ప్రేమ కవయిత్రులు ఆర్. రమాదేవి, గీతా వెల్లంకి కవితల పరిశీలన..!!
హృదయంమీద ప్రేమ నెలవంక ఎప్పుడు పుడుతుందో తెలీనే తెలీదు...
నెలవంక పుట్టినపుడు అది సన్నగానే వుంటుంది.. దిన దిన ప్రవర్ధమానమై
పూర్ణ బింబమౌతుంది.అయితే వియోగంతో,విరహంతో నెలవొంక సన్నబారుతుంది.
అతగాడు దూరమయ్యాక, విరహం వేగలేక ఆమెకు
వేదనే మిగిలింది.హృదయం చుట్టూఅమవాసచీకట్లు
దట్టంగా కమ్ముకున్నాయి.ప్రేమ ఎప్పుడూప్రేమనేకోరు
కుంటుంది. అతగాడున్నా.. లేకున్నా,ప్రేమచిరంజీవం
గానే వుంటుంది…అతగాడికోసం ఆమె చూపులు…
సజీవంగానే వుంటాయి.అతడి కోసంఎదురుచూస్తుంటాయి..
ఆర్. రమాదేవి, గీతా వెల్లంకి..ఇద్దరూ ప్రేమ కవిత్వం రాస్తారు.ఇద్దరూ
ప్రేమ కవితాగానం చేస్తారు. కాకుంటే ఒకే సందర్భం సమయంలో
ఒకే కవితా వస్తుసాదృశ్యంతో కవితలు రాయడం అరుదైన విషయం.
ఈరోజు కాఫీటైమ్లో ఈ..ఇరువురు కవయిత్రుల కవితల్ని.. చూద్దాం.!!
1*ఆర్. రమాదేవి.
No chance... to escape...
“నాకోసం రమ్మని అడగలేక
నీకోసం ఉన్నానని చెప్పలేక
కొత్త కథలు చెప్ప నీవు రాక
పాత కథలింకా మర్చిపోలేక
ఏదో
ఒక రోజు ఇక ఆగిపోతానేమో
వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోతానేమో
గంప నిండు జ్ఞాపకాలు పాతపడ్డాయి
కొత్త రంగులద్ద ఇపుడు ఇచ్ఛలేదు
విదిలించి వేయ మనసు రాదు
నిజంగా
దారే లేని చోటు నిలుచున్నానేమో
నిన్ను పూర్తిగా పోగొట్టుకుంటున్నానేమో
గుబులు గుబులుగా మదినిండుకుంది
ఓయ్
మనసు కాస్తంత మొద్దు బారుతున్నది
ఇక మరింత విసిగించకు
రాకాసి మనసు నిద్ర లేవక ముందే
కాస్త కనిపించి వెళ్ళవోయ్”!!
ఆర్. రమాదేవి ప్రేమ కవిత్వానికి ఓ ప్రత్యేకమైన స్కూల్ వుంది. ఓ మార్క్ వుంది.
ఈ కవిత అదే స్కూల్ నుంచి వచ్చిందే.. కవయిత్రి తన అనుభూతిని అక్షరాల్లోకి
ఒంపే తీరును ఇందులో చూడొచ్చు…
అతగాడు దూరమైనప్పటినుంచీ కూడా అవే ఎదురు చూపులు.అదే నిరీక్షణ.
అతను ఆమెకోసం నిశ్శబ్దాన్ని వదిలి వెళ్ళాడు.ఆమె ఆ నిశ్శబ్దాన్ని నిర్లక్ష్యం
చేయకుండా ఎంతో జాగ్రత్తగా పొదివి పట్టుకొని ఓ మౌనశిలగా మారి,అతని కోసం
నిరీక్షిస్తోంది.
ఆమె చూపులు అతగాడికోసం ఎదురు చూస్తున్నాయి..
తన కోసం రమ్మని అడగలేక,అతగాడి కోసమే ఉన్నానని చెప్పలేక,
కొత్త కథలు చెప్పడంరాక.. పాత కథలింకా మర్చిపోలేక
ఆమె మధనపడుతోంది.. వేదనే జీవనంగా కలం గడుపుతోంది….
“అతగాడు రాకుంటే, అతగాడ్ని చూడకుండానే,
ఏదో ఒక రోజు ఇక ఆగిపోతానేమో, వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోతానేమో”
అన్నదే ఆమె…బాధ. గంప నిండా పోగుపడ్డ జ్ఞాపకాలు పాత పడిపోయాయి..
ఇప్పుడిక కొత్త రంగులద్దలన్నకోరిక లేదు.అలాగని విదిలించి, వదిలేసుకోడానికి
మనసు అంగీకరించడంలేదు..
తాను దారే లేని చోటు నిలుచి వుందేమోనన్న
అనుమానం..అతగాడ్ని పూర్తిగా పోగొట్టుకుంటున్నానేమో
అన్న సంశయం. గుబులు గుబులుగా మదినిండుకుపోయింది..
ఓయ్..!.
ఎక్కడున్నావయ్యా బాబూ…
మనసు మెల్ల మెల్లగా మొద్దు బారుతోంది… ఇక మరింత విసిగించకు..
సహనం నశించేవరకు వేధించకు. ఇబ్బంది పెట్టకు. రాకాసి మనసు
నిద్ర లేవక ముందే కాస్త కనిపించి వెళ్ళవయ్యా బాబూ.. “!
అంటూ ఆమె అర్ధిస్తోంది..
అలాగైనా అతగాడు కనికరిస్తాడేమోనన్ని ఓ చిన్న ఆశ ఆమెది…
అతగాడొస్తాడా…??
ఆమెను కనికరిస్తాడా? కనిపిస్తాడా..??
+++++
2..గీతా వెల్లంకి..
*ఒక గ్లూమీ నెస్…(A Gloomyness)
“నువ్వు మాట్లాడనపుడూ
నీతో మాట్లాడలేనపుడూ...
ఏ గడియారమూ కొలవలేనంత సమయం
నాతో ఉండవూ...
ఇవాళొక క్షణం రేపొక క్షణం కలిపి
కొన్ని యుగాలయాకా --- ఖాళీతనం...
నువ్వొచ్చే వేళా
నువు రాలేని పూటా
అన్నీ కలిసి మోపైనాకా ----
పొద్దు గుంకుతుంది
ఇంకెప్పుడూ తెల్లారనితనంలోకి ఈ రేయి జారుతుంది!
కొంచెం ముందే వస్తావుగా?ఎదురుచూస్తాను”!”
(Geetha velkanki).
ఇది కూడా నిరీక్షణ గీతం. ప్రియుని కోసం నిరీక్షిస్తున్న ఓ ప్రియురాలి నిరాశామయ
మనసు తలంపు.నిరీక్షణ ఎంత కష్టమో ? సఖుడ్ని తలుచుకుంటూగడపడమంటే
పెనం మీద వేగిపోవడమే.అతని కోసం ఎదురు చూపులు..ప్రతిక్షణం మనసులో
రణరంగమే.
తీరా అతను రాకపోతే ఆకాశంలోని నక్షత్రాలు నల్లబడి రాలిపోతాయి. అప్పుడు
ఆకాశం శూన్యంగా మారిపోతుంది.భళ్ళున తెల్లారిపోతుంది.అతని నిరీక్షణలో
దొర్లిపోయే సాయంత్రాలు ఘనీభవించి గడ్డకట్టిపోతాయి..అతడిని వెంటబెట్టుకొచ్చే
రేయి ఎంతకూ తలుపు తట్టదు. ఓ నిరాశామయ వాతావరణం.అయినా,
ఎక్కడో మినుకు మినుకంటూ ఓ చిన్ని ఆశలదీపం చిరువెలుతురు. అదే ఆశ.
ఏ మారుమూలో అతడొస్తాడన్న ఓ గుడ్డి నమ్మకం..
అతగాడు మాట్లాడనపుడూ, అతడితో మాట్లాడలేనపుడూ,ఏ గడియారమూ కొలవలేనంత
సమయం చోటుచేసుకుంటుంది..ఇవాళొక క్షణం రేపొక క్షణం కలిపికొన్ని యుగాలయాకా
కూడా ఖాళీతనమే నెలకొనివుంది. అతగాడొచ్చేవేళా,రాలేని పూటా అన్నీకలిసి మోపైనాకా..
కాలం ఘనీభవించితనతో లేదన్న ఫీలింగ్ ఆమెది.
సమయం జారిపోతోంది. పొద్దు గుంకుతోంది..
ఇంకెప్పుడూ తెల్లారనితనంలోకి రేయి జారుతోంది.
ఎక్కడున్నావయ్యా బాబూ…
కొంచెం ముందే వస్తావుగా?
నీ కోసం ఎదురుచూస్తూ వున్నాను..
ఎవరి ' ప్రైవసీ' వారిదే..ఇతరులతో పంచుకుంటే..
పొందే దానికంటే పోగుట్టుకునేదే ఎక్కువ..ఒంటరితనంలోనే
ఆనందముంది. దాన్ని జుర్రుకోవాలి. అనుభవించాలి,
ఆస్వాదించాలన్నది ఖలీల్ జిబ్రాన్ భావన.నమ్మకం కూడా..
ప్రస్తుతం ఈ ఇద్దరు కవయిత్రుల పరిస్థితి కూడా ఇటువంటిదే..
తివిరి ఇసుకనుండి తైలము తీసినట్లు..నిరాశలోంచి ఆశను
పిండుకోవడం. ఓ చిన్న ప్రేమ దీపాన్ని వెలిగించడం..
*ఎ. రజాహుస్సేన్..